ప్రతిపక్షం, ఆగస్టు 18: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. నవంబర్ నెలకు సంబంధించిన వివిధ ఆర్జిత సేవా టికెట్లను నేడు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచనుంది.
ఆర్జిత సేవల టికెట్ల కోసం ఈ-డిప్ విధానంలో భక్తులు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు నిర్ణీత సమయంలో సేవలకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఇక 24వ తేదీన అంగప్రదక్షిణ టోకెన్లను ఉదయం 10 గంటలకు, శ్రీవాణి దర్శన టోకెన్లను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్ల కోటాను అందుబాటులోకి తీసుకురానున్నారు.
25వ తేదీన ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల బుకింగ్ కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
భక్తులు టికెట్లు, టోకెన్ల కోసం టీటీడీ అధికారిక ఆన్‌లైన్ వేదికను మాత్రమే వినియోగించాలని సూచించింది. నిర్ణీత సమయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు బుకింగ్‌కు ప్రయత్నించే అవకాశం ఉండటంతో ముందుగానే అవసరమైన వివరాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.





























