ప్రతిపక్షం, జూలై 28: దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. **’ప్రజా పరీక్షల్లో అక్రమాల నిరోధక చట్టం’**లో కఠిన సవరణలు తీసుకురానుంది. కొత్త నిబంధనలతో పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులు, అధికారులు, ముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది.
ప్రతిపాదిత సవరణల ప్రకారం, పేపర్ లీక్‌లకు పాల్పడే వ్యక్తులకు ప్రస్తుతం ఉన్న గరిష్ఠ ఐదేళ్ల జైలు శిక్షను పదేళ్లకు పెంచనున్నారు. అలాగే గరిష్ఠ జరిమానాను రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచే ప్రతిపాదన ఉంది.
పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం లేదా అక్రమాలకు సహకరించే అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు. వారికి కనీస జైలు శిక్షను ఐదేళ్లుగా నిర్దేశించనున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక ఉన్న సంఘటిత ముఠాలపై మరింత కఠిన నిబంధనలు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాంటి ముఠాలకు కనీసం ఏడేళ్ల జైలు శిక్షతో పాటు గరిష్ఠంగా రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా చట్టంలో మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం ఈ జరిమానా పరిమితి రూ.1 కోటిగా ఉంది.
అంతేకాకుండా, పేపర్ లీక్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పరీక్షల అక్రమాల కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తిచేసి నిందితులకు శిక్షలు విధించే అవకాశం ఏర్పడనుంది.
ప్రశ్నపత్రాల లీకేజీల వల్ల లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని, ప్రజా పరీక్షలపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఈ కఠిన సవరణలు కీలకంగా మారనున్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త చట్ట సవరణలు అమల్లోకి వస్తే పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు అక్రమాలకు పాల్పడే వారిలో భయం నెలకొనే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

















