ప్రతిపక్షం, జూలై 31, హైదరాబాద్: నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ ఓ బాలికను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఫిలింనగర్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఫిలింనగర్‌కు చెందిన మహ్మద్ రెహాన్ అదే ప్రాంతంలో నివసించే బాలికను బెదిరిస్తూ పలుమార్లు లైంగికంగా వేధించాడు. ఈ క్రమంలో బాధితురాలి నగ్న చిత్రాలను తీసి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ భయపెట్టి దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు కుటుంబ సభ్యుల సహాయంతో ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, బాధితురాలికి అవసరమైన రక్షణ, కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళలు, బాలికలపై ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

















