ప్రతిపక్షం, ఆగస్టు 07: ప్రజా వేదికలపై మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు తమ వ్యాఖ్యల్లో సంయమనం పాటించాలని కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధ్యతాయుతమైన పదజాలాన్ని ఉపయోగించాలని, అనవసర వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తాయని స్పష్టం చేసింది.
బీజేపీ ఎమ్మెల్సీ ఎన్. రవికుమార్ ఓ నిరసన కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి ఫౌజియా తారన్నమ్ను ‘పాకిస్థానీ’ అని సంబోధించిన వ్యవహారంపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రజా ప్రతినిధులు బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాల్లో మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని కోర్టు పేర్కొంది. ఇటువంటి వ్యాఖ్యల కారణంగా అనవసరంగా క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయని, వాటి వల్ల కోర్టులపై భారం పెరిగి తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల విచారణ ఆలస్యమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, వారి వ్యాఖ్యలు సమాజంపై ప్రభావం చూపుతాయని హైకోర్టు సూచించింది.

















