ప్రతిపక్షం, జూలై 30: ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారతదేశంలోని ప్రముఖ ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సోషల్ మీడియా పోస్టులకు మరింత భద్రత కల్పిస్తామని మెటా సంస్థ కేంద్ర సమాచార సాంకేతిక (ఐటీ) మంత్రిత్వ శాఖకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు మెటా అధికారికంగా లేఖ పంపినట్లు వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.
ఇటీవల ప్రధాని మోదీ ఫేస్బుక్లో చేసిన ఒక వీడియో పోస్ట్ సాంకేతిక కారణాలతో కొద్దిసేపు తొలగించబడటం వివాదానికి దారితీసింది. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ప్రముఖ సోషల్ మీడియా వేదికలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మెటా ఇప్పటికే జరిగిన పొరపాటుకు క్షమాపణలు తెలిపింది.
ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా సాంకేతిక భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని సంస్థ స్పష్టం చేసింది. అలాగే ఈ అంశంపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు త్వరలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు పీటీఐ నివేదిక పేర్కొంది.
సోషల్ మీడియా వేదికల్లో ప్రజాప్రతినిధుల అధికారిక పోస్టుల భద్రత, వాటి నిర్వహణలో పాటించాల్సిన విధానాలపై కేంద్ర ప్రభుత్వం కూడా మరింత కఠినమైన పర్యవేక్షణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

















