ప్రతిపక్షం, జూలై 30, వనపర్తి ప్రతినిధి: ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయాలు, పార్టీ భేదాలకు ఏమాత్రం తావులేదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేసే అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. గురువారం వనపర్తి (Wanaparthy) ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ఎరువులు, విత్తనాలు, పశువైద్య వ్యాక్సిన్లు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం, మధ్యాహ్న భోజనంలో నాణ్యత, హాస్టళ్లలో మెరుగైన వసతి, అదనపు తరగతి గదుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మట్టి, ఇసుక సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
లబ్ధిదారులను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్మాణాలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఎంజే–4 ప్రాజెక్టు భూ నిర్వాసిత రైతులకు నష్టపరిహారం త్వరగా అందించాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు.గ్రామాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి సమస్యలు లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇకపై ప్రతి 45 రోజులకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించాలని, సమావేశ అజెండాను 15 రోజుల ముందుగానే సభ్యులకు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ధర్మమని, బాధ్యతాయుతంగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.


















