అత్యవసర సమయాల్లో సీపీఆర్ ఎంతో కీలకం
ప్రతి పోలీసు సిబ్బంది సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలి
మెదక్ జిల్లా ఎస్పీ. శ్రీనివాసరావు,
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 22: అత్యవసర పరిస్థితుల్లో అందించే సీపీఆర్ శిక్షణను సద్వినియోగం చేసుకుని విలువైన ప్రాణాలను కాపాడాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. పోలీసులు నిత్యం ప్రజలతో మమేకమై విధులు నిర్వహిస్తారని, ప్రమాదాలు, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సంఘటనా స్థలానికి ముందుగా చేరుకునే అవకాశం పోలీసులకే ఎక్కువగా ఉంటుందని తెలిపారు.యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయ పరేడ్ గ్రౌండ్లో పోలీసు అధికారులు, సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ నిర్వహించారు. అత్యవసర సమయంలో సీపీఆర్‌ను ఎప్పుడు, ఎలా చేయాలనే అంశాలను వైద్య నిపుణులు ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. సీపీఆర్ చేసే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను డెమో ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గుండెపోటు లేదా ఇతర కారణాలతో వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆస్పత్రికి తరలించేలోపు సీపీఆర్ అందించడం ఎంతో కీలకమన్నారు. సకాలంలో సరైన విధంగా సీపీఆర్ అందించడం ద్వారా బాధితుడి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. సీపీఆర్ ఎప్పుడు, ఎక్కడ అవసరం వస్తుందో చెప్పలేమని.. అందుకే ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తప్పనిసరిగా సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించి బాధితుడికి అవసరమైన ప్రాథమిక ప్రాణరక్షణ చర్యలు చేపట్టేలా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలన్నారు.
పోలీసులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రజలకు కూడా సీపీఆర్ ప్రాముఖ్యతను తెలియజేయాలని ఎస్పీ కోరారు. ఒక వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు సీపీఆర్ ద్వారా ప్రాణాలను కాపాడగలిగితే అంతకంటే గొప్ప సేవ మరొకటి ఉండదన్నారు. ఈ శిక్షణను కేవలం కార్యక్రమానికే పరిమితం చేయకుండా, అవసరమైన సమయంలో ఆచరణలో పెట్టాలని సూచించారు.కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ టౌన్ సీఐ మహేష్, ఆర్ఐలు శైలేందర్, రామకృష్ణ, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, యూత్ ఫర్ సేవా ప్రతినిధులు పాల్గొన్నారు.


























