ప్రతిపక్షం, ఆగస్టు 06: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా కోహెడ మార్కెట్ కమిటీలో వారి చిత్రపటాలకు మంత్రి నివాళులర్పించారు. తెలంగాణ సాధనకు వారు చేసిన సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
అనంతరం కోహెడ వ్యవసాయ మార్కెట్ కమిటీలో రూ.1.61 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో రైతులు, వ్యాపారులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఓపెన్ షెడ్, ఫ్లాట్ఫారం, మీటింగ్ హాల్ నిర్మించనున్నట్లు తెలిపారు.
మార్కెట్ యార్డుకు వచ్చే రైతులు వర్షాలు, ఎండల సమయంలో ఇబ్బందులు పడకుండా ఆధునిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. వ్యవసాయ మార్కెట్లను బలోపేతం చేస్తూ రైతులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మార్కెట్ యార్డుల్లో అవసరమైన సదుపాయాల కల్పనతో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా విక్రయించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నిర్మల జయరాజ్, వైస్ చైర్మన్ భీంరెడ్డి తిరుపతి రెడ్డి, సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


















