ప్రతిపక్షం, ఆగస్టు 04: గుజరాత్‌లో చాందీపుర వైరస్ (Chandipura Virus) కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా 184 అనుమానిత కేసులు నమోదవగా, ఇప్పటివరకు 22 మంది మృతి చెందినట్లు సమాచారం. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమై నివారణ చర్యలను ముమ్మరం చేసింది.
1965లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలోని చాందీపుర గ్రామంలో ఈ వైరస్‌ను తొలిసారి గుర్తించడంతో దీనికి ‘చాందీపుర వైరస్’ అనే పేరు వచ్చింది. మట్టి గోడల్లో నివసించే ‘సాండ్ ఫ్లై’ రకం ఈగలు, కొన్ని రకాల దోమల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ముఖ్యంగా 15 ఏళ్లలోపు చిన్నారులు ఎక్కువగా దీని బారిన పడే ప్రమాదం ఉంది.
ఈ వైరస్‌కు ప్రస్తుతం ప్రత్యేక టీకా లేదా నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు. వైరస్ సోకిన వారికి తీవ్రమైన జ్వరం, వాంతులు, విరేచనాలు, మూర్ఛ, మెదడు వాపు వంటి లక్షణాలు కనిపించవచ్చు. తీవ్రస్థితిలో కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, దోమలు, సాండ్ ఫ్లైలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

















