ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను విజయవంతం చేయాలి.
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 03: ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు.కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల ఉత్సవాల పోస్టర్స్ ను అదనపు కలెక్టర్ నగేష్ తో కలసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి తల్లి తన బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే తల్లిపాలు అందించాలని తెలిపారు. తల్లిపాలు శిశువుకు సురక్షితమైనవి, స్వచ్ఛమైనవి, పోషక విలువలు కలిగినవని, శిశువు ఆరోగ్యవంతంగా ఎదగడానికి తల్లిపాలే బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు.బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం తల్లిపాలు ఎంతో అవసరమని, కనీసం ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని సూచించారు.
తల్లిపాలు అందించడం ప్రతి బిడ్డ హక్కు అని, ప్రతి తల్లి తన మాతృత్వ బాధ్యతను గుర్తించి పిల్లలకు తల్లిపాలు అందించాలని కోరారు.తల్లులు తీసుకునే పోషకాహారం ద్వారానే స్వచ్ఛమైన పాలు బిడ్డలకు అందుతాయని, దీంతో పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఎదుగుతారని తెలిపారు. బలమైన బాల్యానికి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు.ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తల్లులను ప్రోత్సహించి, ప్రతి శిశువుకు తల్లిపాలు అందేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న తల్లి పాల వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తల్లులందరికీ ప్రపంచ తల్లి పాల వారోత్సవాల శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అదరపు కలెక్టర్ నగేష్ డీ డబ్ల్యూ హేమ భార్గవి, డిసి.హెచ్.ఎస్ శివదయాల్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, ఏ ఎం ఓ రాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గణేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

















