ప్రతిపక్షం, జూలై 29: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసు నమోదైన రోజే బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమె శరీరంపై పలు గాయాలున్నట్లు వైద్యుల నివేదికలో వెల్లడైంది. మెడపై గాయాల గుర్తులు, గొంతు నులిమేందుకు ప్రయత్నించినట్లు సూచించే ఆనవాళ్లు, చెంపపై కమిలిన గాయాలు, ఎడమ కాలిపై దెబ్బలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.
ఈ మెడికల్ నివేదికను దర్యాప్తులో కీలక ఆధారంగా పరిగణిస్తున్న పోలీసులు, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించిన అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
మెడికల్ నివేదికలో నమోదైన అంశాలు దర్యాప్తుకు బలం చేకూర్చే అవకాశమున్న నేపథ్యంలో, కేసు విచారణపై ఆసక్తి నెలకొంది. అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం చట్టప్రకారం తదుపరి చర్యలు చేపడతామని పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం.

















