ప్రతిపక్షం, ఆగస్టు 05: కేరళ మంత్రి సీపీ జాన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల వినియోగం, విద్యా వ్యవస్థపై మాట్లాడిన ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
ఉచిత బస్సు సేవలను వినియోగించుకునేందుకు గృహిణులు రద్దీలో ప్రయాణించడానికి ప్రధాన కారణం వారి చేతిలో తగినంత డబ్బు లేకపోవడమేనని మంత్రి పేర్కొన్నారు. అయితే అదే సమయంలో ప్రభుత్వ ఉచిత బస్సులు, ప్రభుత్వ ఆస్పత్రులను ఉపయోగించుకుంటూ, తమ పిల్లలను మాత్రం ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం విరుద్ధ ధోరణిగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యాసంస్థలకే ప్రాధాన్యం ఇవ్వడం ఆశ్చర్యకరమని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సేవలపై ప్రజలకు విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉందని కూడా ఆయన సూచించారు.
అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ప్రజల ఆర్థిక పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకుని వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ, ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం కేరళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

















