[t4b-ticker]

6న ‘‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’’

సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సభ.. పోస్టర్ ఆవిష్కరించిన టీఆర్ఎస్ నాయకులు

ప్రతిపక్షం, ఆగస్టు 01, హైదరాబాద్: సామాజిక న్యాయ తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ ఈనెల 6వ తేదీన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ‘‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’’ నిర్వహిస్తోంది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని సరూర్ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన నాయకులు తెలిపారు. శనివారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు ఎల్. రూప్ సింగ్ మాట్లాడుతూ, తెలంగాణలో ప్రతి సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం దక్కాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ నెల 6న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ నిర్వహించనున్నామని చెప్పారు. సామాజిక తెలంగాణ కావాలని కోరుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి రోజునే ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల్లోని అనేక కులాల వారికి కనీసం గ్రామ సర్పంచ్ గా కూడా అవకాశం దక్కడం లేదన్నారు. అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో ప్రాతినిధ్యం దక్కేలా ఈ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నవీన్ ఆచారి, నరేశ్ ప్రజాపతి, కోల శ్రీనివాస్, చిలుక ప్రవీణ్, సుహైబ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News