SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?.. 2027 సీజన్‌కు కొత్త నాయకత్వంపై ఊహాగానాలు

ప్రతిపక్షం, ఆగస్టు 07: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయనే వార్తలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జట్టు నాయకత్వంలో మార్పులు ఉండొచ్చన్న ఊహాగానాల మధ్య ఇషాన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చే ఏడాది జరిగే యాషెస్ సిరీస్‌తో పాటు వన్డే ప్రపంచకప్‌పై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారని, దీంతో SRHకు పూర్తి సమయం అందుబాటులో ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.

ఈ పరిస్థితుల్లో జట్టు యాజమాన్యం యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌కు పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఐపీఎల్ సీజన్‌లో ఇషాన్ ఏడు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు కూడా ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లోనూ నాయకత్వ అనుభవాన్ని పెంచుకుంటున్న ఆయనకు SRH కెప్టెన్సీ దక్కే అవకాశాలపై చర్చ కొనసాగుతోంది.

అయితే ఈ విషయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఐపీఎల్-2027కు ముందు జట్టు యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News