ఖేలో ఇండియా క్రీడలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రతిపక్షం, నవంబర్ 03: తెలంగాణలో డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యువజన క్రీడలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పోటీల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని సూచించారు. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఈ పోటీలను మంచి అవకాశంగా మలుచుకోవాలని స్పష్టం చేశారు.

ఎనిమిదో విడత ఖేలో ఇండియా యువజన క్రీడలు-2026 నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల కోసం అత్యున్నత ప్రమాణాలతో కూడిన మైదానాలు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. కేవలం పోటీల నిర్వహణకే పరిమితం కాకుండా, భవిష్యత్తులోనూ రాష్ట్ర క్రీడాకారులకు ఉపయోగపడేలా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు ఉండాలని తెలిపారు.

తెలంగాణకు ప్రత్యేక గుర్తింపుగా ఉన్న కర్రసాము క్రీడను కూడా ఆతిథ్య రాష్ట్ర కోటాలో ఖేలో ఇండియా పోటీల్లో చేర్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రానున్న రోజుల్లో ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయి శిక్షణ, అత్యాధునిక క్రీడా సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఈ పోటీల ద్వారా రాష్ట్ర యువ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించాలన్నారు.

క్రీడల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించేందుకు గ్రూప్‌-1 స్థాయి అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. వివిధ జిల్లాల్లో పోటీలు జరగనున్నందున ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న స్థానిక అధికారులను కూడా పర్యవేక్షణ బాధ్యతల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. దేశం నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులకు వసతి, రవాణా, ఇతర సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోటీల నిర్వహణ, ఏర్పాట్ల పురోగతిపై ప్రతి వారం తనకు నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.

ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రారంభ, ముగింపు వేడుకల్లో అనవసరమైన ఆడంబరాలకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. అదే సమయంలో ఇన్వెస్ట్‌ తెలంగాణ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ఏర్పాట్ల కోసం సమకూర్చిన వనరులను ఖేలో ఇండియా క్రీడల నిర్వహణకు కూడా వినియోగించుకోవాలని చెప్పారు. క్రీడలు, క్రీడాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం కూడా అంతర్జాతీయ సదస్సులో భాగంగా ఉండాలని, ఇందుకోసం సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వేలాది మంది యువ క్రీడాకారులు పాల్గొననున్నారు. సుమారు రెండు వేల మంది శిక్షణ సిబ్బంది, అధికారులు కూడా హాజరుకానున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మరో ఐదు నగరాల్లో మొత్తం 20 వేదికలపై 27 రకాల క్రీడా పోటీలు, ఒక ప్రదర్శన పోటీ నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరిచేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వివిధ వేదికల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతిని కూడా వెల్లడించారు.

తెలంగాణ క్రీడా విధానం, యంగ్ ఇండియా శారీరక విద్య, క్రీడా విశ్వవిద్యాలయం ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఖేలో ఇండియా పోటీలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర క్రీడా రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News