రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించే జ్ఞానాన్ని ప్రభుత్వానికి ప్రసాదించాలి
ఏడుపాయల వనదుర్గాభవానీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి
ప్రతిపక్షం మెదక్ ప్రతినిధి అక్టోబర్ 15: వనదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించే జ్ఞానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమా, బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకులతో కలిసి ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గాభవానీ అమ్మవారిని పద్మా దేవేందర్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోకుల్ షెడ్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని సందర్శించి కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సమర్పించిన 108 బోనాల కార్యక్రమంలో పాల్గొని బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల నడుమ జరిగిన బోనాల వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెను ఆలయ మర్యాదలతో సన్మానించారు.అనంతరం పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని ప్రార్థించినట్లు తెలిపారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.వ్యవసాయ రంగానికి విద్యుత్ ఎంతో కీలకమని, రైతులకు కోతలు లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సరైన సమయంలో విద్యుత్ అందక రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
గతంలో కరోనా వంటి విపత్కర పరిస్థితులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థంగా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. అదే విధంగా ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడటంతోపాటు రైతుల సమస్యలను పరిష్కరించి వ్యవసాయ రంగానికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు.అనంతరం ఆలయ అర్చకులు పద్మా దేవేందర్‌రెడ్డికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






























