అమరవీరులకు ఘన నివాళి..

ఉద్యమ దీక్షా శిబిరానికి పూల వందనం!

దీక్షా దివస్ సందర్భంగా రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు

1,531 రోజుల చారిత్రక దీక్షా శిబిరం పైలాన్ వద్ద హరీశ్ రావు, దేశపతి శ్రీనివాస్ పుష్పాంజలి

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, నవంబరు 29: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన చారిత్రక ఉద్యమంలో అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ దీక్షా దివస్ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం సిద్ధిపేటలోని రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నాయకులు, పార్టీ శ్రేణులు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు చేసిన పోరాటం, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అమరుల ఆశయాల సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

1,531 రోజుల దీక్షా శిబిరానికి పుష్పాంజలి

తెలంగాణ సాధన కోసం సిద్ధిపేటలో నిరంతరంగా 1,531 రోజుల పాటు కొనసాగిన చారిత్రక నిరాహార దీక్షా శిబిరం పైలాన్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పైలాన్‌కు పూలతో వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆనాటి తెలంగాణ ఉద్యమ పోరాట ఘట్టాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో అడ్డంకులు, అరెస్టులు, నిర్బంధాలను ఎదుర్కొంటూ ఉద్యమకారులు సాగించిన పోరాటాన్ని స్మరించుకున్నారు. సిద్ధిపేట గడ్డ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. నవంబరు 29వ తేదీన కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపుగా నిలిచిందని నాయకులు గుర్తుచేశారు. అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలు, ప్రజల ఐక్యత ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పాత్రికేయులు తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.

Related News

Latest News