మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు : ట్రాఫిక్ ఏసీపీడీపీ నరేందర్
సైబరాబాద్, ప్రతిపక్షం,నవంబర్ 22: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 288 మంది పట్టుబడ్డారు. ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. ఈ వివరాలను సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ అడ్మిన్ జి. నరేందర్ వెల్లడించారు.పట్టుబడిన వారిలో 241 మంది ద్విచక్ర వాహనదారులు, 12 మంది ఆటో డ్రైవర్లు, 34 మంది కార్ల డ్రైవర్లు, ఒక హెవీ వెహికల్ డ్రైవర్ ఉన్నారు.
బీఏసీ స్థాయిల ఆధారంగా కేసులు
బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ (బీఏసీ) స్థాయిలను పరిశీలిస్తే.. 231 మంది 36 నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 37 మంది 201 నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, మరో 20 మంది 301 నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ స్థాయితో పట్టుబడ్డారు. వీరందరినీ చట్టపరమైన చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదాలకు కారణమైతే పదేళ్ల జైలు
మద్యం సేవించి వాహనాలు నడపడం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమై ప్రాణనష్టం కలిగిస్తే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)-2023లోని సెక్షన్ 105 కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ సెక్షన్ కింద నేర తీవ్రతను బట్టి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించవచ్చని పేర్కొన్నారు.
గత వారం 218 కేసుల పరిష్కారం
గత వారం (నవంబర్ 16 నుంచి 21 వరకు) డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి 218 కేసులను కోర్టులు పరిష్కరించాయి. ఈ కేసుల్లో 218 మందికి జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసు అధికారులు వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని, రోడ్డు భద్రతకు సహకరించాలని పోలీసులు సూచించారు.






























