కస్తాలలో రైతుల ఆగ్రహం.. సబ్ స్టేషన్ ముందు నిరసన

*రైతులకు12 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు ఇవ్వాలి.

*ఉదయం 5 నుండి సాయంత్రం 5 వరకు విద్యుత్ కావాలని డిమాండ్.

*9 గంటల కరెంటుతో పంటలు కాపాడలేం – రైతుల ఆవేదన.

*పెట్టుబడి కూడా రాకుండా అప్పుల పాలవుతున్నాం – కస్తాల రైతులు.

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 16 : చండూరు మండలం కస్తాల గ్రామంలో రైతులు తిరగబడ్డారు. వ్యవసాయానికి నిరంతరాయంగా 12 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కస్తాల గ్రామంలోని సబ్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. పొలాల్లో పని వదిలేసి పెద్ద సంఖ్యలో రైతులు సబ్ స్టేషన్ ముందు బైఠాయించి తమ ఆవేదనను వినిపించారు.

*రైతుల పరిస్థితి దయనీయం…
కస్తాల గ్రామంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంటలు పండించాలని ఆశతో పొలాల్లోకి దిగిన రైతులు కరెంటు లేక తమ కళ్ళ ముందే పంటలు ఎండిపోతుంటే ఏమీ చేయలేక కన్నీరు పెడుతున్నారు.పంట చేతికి వచ్చే కీలక సమయంలో నీరు అందకపోతే రైతు జీవితమే నాశనం అవుతుంది. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదు. అప్పుల పాలవుతాం. ఈ బాధను అధికారులు అర్థం చేసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

*9 గంటల కరెంటు సరిపోవడం లేదు.

ప్రస్తుతం గ్రామానికి కేవలం 9 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని, ఆ కరెంటు పంటలకు ఏ మాత్రం సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్లలో మోటార్లు ఉన్నా, కరెంటు లేక పొలాలకు నీరు పెట్టలేకపోతున్నామని వాపోతున్నారు.ఒక పొలానికి నీరు పెడితే మరో పొలానికి నీరు పెట్టేలోపే కరెంటు పోతోందని, దీంతో పంటలకు సరైన సమయంలో నీరు అందడం లేదని చెబుతున్నారు. వరి, పత్తి, కూరగాయ పంటలు నీరు లేక వాడిపోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే పంట చేతికి రాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

*రైతుల ప్రధాన డిమాండ్

రైతులు రోజుకు 12 గంటల కరెంటు ఇవ్వాలని, అది కూడా ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలని కోరుతున్నారు.ఉదయం నుండి సాయంత్రం వరకు కరెంటు ఉంటేనే పంటలకు సరిగా నీరు పెట్టగలమని, పంటలను కాపాడుకోగలమని చెబుతున్నారు. మధ్యలో కరెంటు పోకుండా, వోల్టేజ్ తగ్గకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

*సబ్ స్టేషన్ ముందు నిరసన.

తమ వినతులను అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు శుక్రవారం సబ్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. “మాకు 12 గంటల కరెంటు కావాలి”, “రైతులను కాపాడండి”, “పంటలు ఎండిపోతున్నాయి. – అధికారులు స్పందించండి” అంటూ నినాదాలు చేశారు. రైతు బతుకుతేనే ఊరు బతుకుతుంది, రైతు పండిస్తేనే ప్రజలకు తిండి దొరుకుతుంది. కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి కస్తాల గ్రామానికి 12 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.అధికారులు తమ సమస్యను పరిష్కరించే వరకు పోరాటం ఆపబోమని, అవసరమైతే మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కస్తాల, మెండువారిగూడెం, గోపిడి వారి గూడెం, ఉడతల పల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News