సిద్ధిపేట వైద్య విద్యా సంస్థకు అనంతుల మదన్ మోహన్ పేరు

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఇకపై ‘అనంతుల మదన్ మోహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’గా గుర్తింపు

ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 22: సిద్ధిపేట జిల్లాలో వైద్య విద్య, వైద్య సేవల రంగంలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు దివంగత మాజీ మంత్రి, సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే అనంతుల మదన్ మోహన్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ 2026 నవంబర్ 20వ తేదీన జీవో నంబర్ 178ను విడుదల చేసింది. దీంతో సిద్దిపేట వైద్య కళాశాల ఇకపై ‘అనంతుల మదన్ మోహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’గా పిలుస్తారు.

ముఖ్యమంత్రి ప్రకటనకు ప్రభుత్వ ఉత్తర్వుల రూపం

ఈ నెల 19వ తేదీన సిద్దిపేట పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్రానికి, ముఖ్యంగా సిద్ధిపేట ప్రాంతానికి దివంగత అనంతుల మదన్ మోహన్ చేసిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆయన పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నెల 20వ తేదీన అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

అయిదు వైద్య సంస్థలకు ఒకే పేరు

ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 178 ప్రకారం సిద్దిపేటలో ఇప్పటికే మంజూరైన, స్థాపించిన అయిదు వైద్య సంస్థల పేర్లకు అనంతుల మదన్ మోహన్ పేరును ముందుగా చేర్చనున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, బీఎస్సీ అనుబంధ ఆరోగ్య విజ్ఞానశాస్త్ర కళాశాల, ఆయుష్ సమీకృత ఆసుపత్రి పేర్లకు ‘అనంతుల మదన్ మోహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ అనే పేరును ముందుగా చేర్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా సంస్థల ప్రత్యేక గుర్తింపులు, పరిపాలనా వ్యవస్థలు, విద్యా సంబంధిత విధానాలు, నియంత్రణ పరమైన ఏర్పాట్లు యథాతథంగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

అనంతుల మదన్ మోహన్ సేవలకు గుర్తింపు

దివంగత అనంతుల మదన్ మోహన్ తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు. తెలంగాణ ప్రజాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన అనంతుల మదన్ మోహన్ మొదటి సారి 1970 సవత్సరంలో తెలంగాణ వాదంతో జరిగిన సిద్ధిపేట ఉప ఎన్నికలో తెలంగాణ ప్రజాసమితి తరపున భారీ మెజారిటీతో గెలిచి తెలంగాణ ఆకాంక్ష ప్రజల్లో ఉందని రుజువు చేశారు. అప్పటి నుంచి వరుసగా గెలిచి 1985 వరకు సిద్ధిపేటకు ప్రాతినిధ్యం వహించారు. 1983లో ఎన్టీఆర్ ప్రభజనంలోనూ సిద్ధిపేట నుంచి గెలిచి 1983 నుంచి 1985 వరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. సిద్ధిపేట ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా, ప్రతిపక్ష నేతగా పని చేసిన అనంతుల మదన్ మోహన్ సిద్ధిపేట అభివృద్ధికి చేసిన కృషి మరువలేనిది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన మదన్ మోహన్ సిద్ధిపేట జిల్లాలో ఆస్పత్రుల అభివృద్ధికి కృషి చేశారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే నంగునూరులోని ఆరు పడక ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను, రాష్ట్రానికి చేసిన కృషిని గౌరవిస్తూ ఆయన పేరును సిద్ధిపేట వైద్య విద్యా సంస్థకు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ప్రముఖ ప్రజాప్రతినిధి సేవలను ప్రభుత్వ వైద్య విద్యా సంస్థ పేరుతో చిరస్థాయిగా నిలిపే నిర్ణయంగా దీనిని చూడవచ్చు.

అధికారులకు ఆదేశాలు

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సంఖ్య 178 అమలుకు సంబంధించి వైద్య విద్య సంచాలకుడు, సిద్ధిపేట జిల్లా కలెక్టర్, సంబంధిత సంస్థల అధిపతులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్.చోంగ్తు సంతకం చేశారు.

సిద్ధిపేట చరిత్రలో మరో ప్రత్యేక గుర్తింపు

సిద్ధిపేటలో వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, అనుబంధ ఆరోగ్య విజ్ఞానశాస్త్ర కళాశాల, ఆయుష్ సమీకృత ఆసుపత్రి వంటి వైద్య సంస్థలకు ఒకే పేరును అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రాంత వైద్య విద్యా సంస్థలకు ఒక ప్రత్యేక గుర్తింపు లభించనుంది. అనంతుల మదన్ మోహన్ పేరు ఇకపై వైద్య విద్యా రంగంతో ముడిపడి ఉండనుంది.ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 178తో ముఖ్యమంత్రి ప్రకటించిన నిర్ణయం అధికారికంగా అమలులోకి వచ్చింది. సిద్ధిపేట వైద్య విద్యా సంస్థకు అనంతుల మదన్ మోహన్ పేరు పెట్టడం ఆయన సేవలకు ప్రభుత్వం అందించిన గౌరవప్రద గుర్తింపుగా నిలవనుంది.

మదన్ మోహన్ పేరు హర్షణీయం

-సయ్యద్ మిస్కిన్ అహ్మద్, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్, సిద్ధిపేట

సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు తొలి తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి, సిద్ధిపేట మాజీ ఎమ్మెల్యే దివంగత అనంతుల మదన్ మోహన్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని సిద్ధిపేట మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ మిస్కిన్ అహ్మద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన సమయంలో అనంతుల మదన్ మోహన్ సిద్దిపేట ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారని ఆయన కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో తొలి తరం నాయకుడిగా ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు మదన్ మోహన్ పేరు పెట్టడం వల్ల భవిష్యత్ తరాలకు ఆయన సేవలు గుర్తుండి పోతాయని అభిప్రాయపడ్డారు. ఇకపై సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ‘అనంతుల మదన్ మోహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ పేరుతో కొనసాగడం ఆనంద దాయకమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన సందర్భంగా చేసిన ప్రకటనకు అనుగుణంగా ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సిద్ధిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, బీఎస్సీ అనుబంధ ఆరోగ్య విజ్ఞాన కళాశాల, ఆయుష్ సమీకృత ఆసుపత్రి పేర్లకు అనంతుల మదన్ మోహన్ పేరును జోడించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దివంగత మదన్ మోహన్ సేవలకు తగిన గుర్తింపు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సయ్యద్ మిస్కిన్ అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు.

Related News

Latest News