రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ సీరియస్

ప్రతిపక్షం, నవంబర్ 19: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రభుత్వంపై బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో పార్టీలో చర్చ మొదలైంది. ఈ వ్యవహారాన్ని పార్టీ అంతర్గత క్రమశిక్షణకు సంబంధించిన అంశంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.

నిన్న మునుగోడులో జరిగిన కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల తీరుపై విమర్శలు చేశారు. అభివృద్ధి నిధుల కేటాయింపులో కొన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ, మునుగోడు వంటి ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు కేటాయించినా తమకు అభ్యంతరం లేదని, అయితే మునుగోడుకు కనీసం రూ.500 కోట్లైనా కేటాయించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, చౌటుప్పల్‌లో ప్రతిపాదించిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణం వంటి పనులు నిధుల కొరతతో ముందుకు సాగడం లేదని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించినట్లు వార్తలు వెలువడ్డాయి. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ఏఐసీసీ నాయకత్వానికి పంపడంతో పాటు, ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నాయకుల మధ్య బహిరంగ విమర్శలు, విభేదాలు చర్చకు వస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

రాజగోపాల్ రెడ్డి మాత్రం తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, తన నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి నిధుల కోసమే ప్రశ్నిస్తున్నానని గతంలోనూ స్పష్టం చేశారు. మంత్రి పదవి కోసం ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, మునుగోడు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తన ఉద్దేశమని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఈ ఫిర్యాదుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

Related News

Latest News