ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ సెప్టెంబర్ 28: వంశపారంపర్యంగా వస్తున్న ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదని వాడి గ్రామానికి చెందిన గుమ్మల నరసింహ రెడ్డి (70) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మెదక్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ కు వినతిపత్రం సమర్పించారు. హవేలి ఘనపూర్ మండలం వాడి గ్రామంలో తన తాత మల్లారెడ్డి, తండ్రి రాజిరెడ్డి నుంచి సంక్రమించిన ఐదు గుంటల స్థలం ఉందని నరసింహ రెడ్డి తెలిపారు. ఈ స్థలంలో ప్రస్తుతం ఉన్న గుడిసెను తొలగించి నూతనంగా ఇల్లు నిర్మించుకునేందుకు గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకున్నానని పేర్కొన్నారు. అయితే, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే పంచాయతీ కార్యదర్శి దరఖాస్తును తిరస్కరించారని ఆరోపించారు. గ్రామంలో ఇతరులకు గృహ నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తున్నప్పటికీ, తన కు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించినా ఫలితం లేదన్నారు. ఎంపీడీఓ కార్యాలయానికి సైతం ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. తనకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, వంశపారంపర్యంగా సంక్రమించిన స్థలంలో ఇంటి నిర్మాణానికి అనుమతి మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను నరసింహ రెడ్డి కోరారు.





























