వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 13: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, భవిష్యత్తులో నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.గత సీజన్‌తో పోలిస్తే ఈసారి తక్కువ వర్షపాతం నమోదైందని, భూగర్భ జలాలు, చెరువులు, ఇతర నీటి వనరులపై ఎల్‌నినో ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. రైతులు వరి సాగుపైనే ఆధారపడకుండా కంది, మొక్కజొన్న, పెసలు, మినుములు, శనగ, వేరుశనగ, సోయాబీన్, జొన్న, సజ్జ వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు.

ప్రత్యామ్నాయ పంటల విత్తనాల లభ్యత, సబ్సిడీ వివరాలతో సమగ్ర నివేదిక రూపొందించి, మండలాలు, గ్రామాల వారీగా రైతుల అవసరాలను గుర్తించాలని సూచించారు. రెండు రోజుల్లో జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసే పంటలు, మద్దతు ధరలు, మార్కెట్ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, రబీ సీజన్‌కు ముందే తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News