తెలంగాణ ప్రతిష్ఠను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేలా గ్లోబల్ సమ్మిట్‌: మంత్రి శ్రీధర్ బాబు

ప్రతిపక్షం, నవంబర్ 24: తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే లక్ష్యంతో గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సదస్సు నిర్వహణకు సంబంధించి వివిధ విభాగాలు చేపడుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సమ్మిట్‌కు సంబంధించిన ప్రధాన వేదిక, ఎక్స్‌పో జోన్, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, రవాణా సౌకర్యాలు, కనెక్టివిటీ, విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖ అతిథులకు కల్పించాల్సిన వసతి సదుపాయాలపై మంత్రి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ప్రతి అంశంలోనూ ఎలాంటి లోపాలకు తావులేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్న నేపథ్యంలో వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఏర్పాట్ల విషయంలో నాణ్యతతో పాటు సమయపాలనకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు గడువు సమీపిస్తున్నందున ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా అన్ని పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. ఒక్కో విభాగం విడివిడిగా కాకుండా పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే సదస్సును విజయవంతంగా నిర్వహించగలమని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకొచ్చే ఈ సదస్సు నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం చేశారు.

Related News

Latest News