ప్రతిపక్షం, నవంబర్ 23: తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఏపీ నాయకులను విమర్శించడం కంటే తెలంగాణ ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరిని ప్రజలు తప్పుబడుతున్నారని అన్నారు. నిబంధనల ప్రకారం, అపెక్స్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు.
సోమవారం రాజమహేంద్రవరంలో పర్యటించిన కవిత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నీటి వనరులను పంపిణీ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకరించాలని కోరారు. అనుమతులు లేకుండానే కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతోందని ఆమె ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో వివాదాలు పెరగకుండా, పరస్పర సహకారంతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. తన స్నేహితురాలి తల్లి మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాజమహేంద్రవరం వచ్చినట్లు కవిత తెలిపారు.



















