నంగునూరు మండల డీవై ఎఫ్ఐ కన్వీనర్‌గా తాళ్లపల్లి ప్రణయ్

ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 3: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య నంగునూరు మండల సమన్వయకర్తగా రాజగోపాల పేట గ్రామానికి చెందిన తాళ్లపల్లి ప్రణయ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో దాసరి ప్రశాంత్ మాట్లాడుతూ.. మండలంలోని యువత, నిరుద్యోగ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎంతోమంది యువకులు చదువులు పూర్తి చేసుకున్నప్పటికీ తగిన ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మండలంలో పరిశ్రమలు, ప్రైవేటు సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. ఏర్పాటు చేసే పరిశ్రమలు, సంస్థల్లో స్థానిక యువతకు ప్రాధాన్యత కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. డీవైఎఫ్ఐ నూతన మండల కన్వీనర్ గా ఎన్నికైన తాళ్ళపల్లి ప్రణయ్ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నిరుద్యోగ సమస్యల పరిష్కారం, విద్యార్థుల హక్కుల సాధన కోసం యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.

Related News

Latest News