ఎన్సాన్‌పల్లి, నారాయణరావుపేటలో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే హరీశ్‌ రావు సతీమణి శ్రీనిత

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబర్ 19: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు సిద్ధిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌ పల్లి గ్రామంతో పాటు నారాయణరావుపేట మండల కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచులు ప్రకృతిని ఆరాధిస్తూ, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఎన్సాన్‌పల్లిలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సతీమణి శ్రీనిత పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో భాగస్వామ్యమయ్యారు. నారాయణరావుపేటలో జరిగిన బతుకమ్మ వేడుకల్లోనూ శ్రీనిత పాల్గొన్నారు.దీంతో రెండు గ్రామాల్లో సందడి నెలకొంది. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. రాష్ట్రమంతటా దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించడం ఆనవాయితీగా ఉండగా, ఎన్సాన్‌పల్లి, నారాయణరావుపేటలో మాత్రం దుర్గా నవమి రోజున సద్దుల బతుకమ్మను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.

బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళల ఐక్యతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలుస్తోంది. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో బతుకమ్మలను పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆరాధించడం తెలంగాణ ప్రత్యేకత. సద్దుల బతుకమ్మ రోజున కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు ఒకచోట చేరి పండుగను సామూహికంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.నారాయణరావుపేట మండల కేంద్రంలోనూ సద్దుల బతుకమ్మ వేడుకలు సందడిగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ వేడుకలను నిర్వహించారు. పూల సోయగాలు, బతుకమ్మ పాటలు, మహిళల కోలాటాలతో గ్రామాల్లో పండుగ శోభ సంతరించుకుంది.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామీణ జీవన విధానంతో ముడిపడిన ఈ పండుగ మహిళల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు ప్రకృతిని గౌరవించాలనే సందేశాన్ని అందిస్తోంది. సిద్ధిపేట ప్రాంతంలోని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలిచాయి.

Spread the love

Related News

Latest News