*భారత తొలి ప్రధాని నెహ్రూ జయంతి సందర్భంగా విద్యార్థుల ఆటపాటలు.
*చిన్నారుల కేరింతలతో మార్మోగిన పాఠశాల ప్రాంగణం.
*నేటి బాలలే రేపటి పౌరులు – ప్రిన్సిపల్ పోలోజు నరసింహ చారి.
*విద్యా రంగంలో విశేష సేవలు – ప్రిన్సిపల్ నరసింహ చారికి అరుదైన గౌరవం .
*శివలీల ఫౌండేషన్ తరపున నెహ్రూ జాతీయ పురస్కార ప్రదానం
ప్రతి పక్షం చండూరు నవంబర్ 14 : భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శనివారం చండూరులోని గీతా విద్యాలయం (E/M) పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, విద్యార్థినీ విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేస్తూ నెహ్రూ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ పోలోజు నరసింహాచారి గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, “నేటి బాలలే రేపటి పౌరులు” అని పేర్కొంటూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలని దిశానిర్దేశం చేశారు.
అనంతరం చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.చిన్నారులంటే ఎంతో ఇష్టపడే నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల తోరణాలు, బెలూన్లతో సుందరంగా అలంకరించారు.ముందుగా పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు తమదైన శైలిలో ఆటపాటలు, డ్యాన్సులు, పాటలు, స్పీచ్ లతో అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారుల కేరింతలు, చప్పట్లతో పాఠశాల ప్రాంగణం మార్మోగిపోయింది. పిల్లలే దేశ భవిష్యత్తు అని, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే ఉపాధ్యాయుల లక్ష్యం కావాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సూచించారు.
*జాతీయ పురస్కారం – గీత విద్యాలయానికి గర్వకారణం: విద్యా రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ పోలోజు నరసింహాచారి గారికి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ‘నెహ్రూ అవార్డు’ లభించింది. శివలీల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి కంబాలపల్లి శివలీల గారి చేతుల మీదుగా ఈ అవార్డును నరసింహాచారి గారికి ప్రదానం చేశారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న గీత విద్యాలయ సంస్థల ప్రిన్సిపల్ పోలోజు నరసింహ చారి గారికి శివలీల ఫౌండేషన్ తరపున ప్రతిష్టాత్మకమైన భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జాతీయ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ పురస్కారం రావడం గీతా విద్యాలయ పాఠశాలకే కాకుండా చండూరు పట్టణానికే గర్వకారణమని పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గారిని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


























