*మండలంలో దారుణం – వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో దారుణ హత్య .
*ముగ్గురు పిల్లల తల్లి రజిత (37) దారుణ హత్య – గ్రామంలో తీవ్ర కలకలం.
*ఘటనా స్థలానికి చేరుకున్న నాంపల్లి CI, మర్రిగూడ SI – నిందితుడు ఇంద్రయ్య అదుపులో? దర్యాప్తు ముమ్మరం.
ప్రతి పక్షం మర్రిగూడ అక్టోబర్ 24 :vవివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్యపై అనుమానంతో రగిలిపోయిన భర్త కత్తితో దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన సుంకరి ఇంద్రయ్య తన భార్య రజిత (37) పై శనివారం ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో రజిత అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ దారుణ ఘటనతో శివన్నగూడెం గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.
*ముగ్గురు పిల్లల కుటుంబంలో విషాదం:
సుంకరి ఇంద్రయ్య, రజిత దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. అయితే రెండేళ్ల క్రితం వారి కుమారుడు పురుగుల మందు తాగి వ్యవసాయ బావి సమీపంలో మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. శివన్నగూడెం రిజర్వాయర్ ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం నుంచి వలస వచ్చిన ఈ కుటుంబం ప్రస్తుతం శివన్నగూడెంలో నివాసం ఉంటోంది.గతంలోనూ భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. భార్యపై కొంతకాలంగా అనుమానం పెంచుకున్న ఇంద్రయ్య ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.
*పోలీసుల దర్యాప్తు:
హత్య ఘటనపై సమాచారం అందుకున్న నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు ఆధ్వర్యంలో మర్రిగూడ ఎస్ఐ బి. రాంబాబు పోలీసు సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఇతర వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.




























