సింగిల్ విండో విధానంలో పౌల్ట్రీ పరిశ్రమకు అనుమతులు : సీఎం రేవంత్​రెడ్డి

ప్రతిపక్షం, నవంబర్ 25: తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రంగంలో కొత్తగా పరిశ్రమలు, పౌల్ట్రీ ఫారాలు ఏర్పాటు చేసుకునే వారికి అనుమతులు త్వరగా మంజూరు చేసేందుకు సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు. పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న దాణా కొరత సమస్యను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం, పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడి వారి సమస్యలపై భరోసా ఇచ్చారు.

పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమైన మొక్కజొన్న, సోయాబీన్ వంటి దాణా ముడిసరుకుల లభ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందనే ఆందోళనతో పరిశ్రమ వర్గాలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో రెండేళ్లకు సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. మొక్కజొన్న, సోయాబీన్ నిల్వలను వ్యాపారుల ద్వారా కాకుండా నేరుగా పౌల్ట్రీ రైతులు, వ్యాపారులకు అందించే అవకాశాలను పరిశీలించాలని మంత్రులకు సూచించారు. తద్వారా దాణా సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు పౌల్ట్రీ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బఫర్ నిల్వలపై సమీక్ష నిర్వహించి, దాణా సమస్యను 48 గంటల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీహరిని ఆదేశించినట్లు సీఎం వెల్లడించారు. పౌల్ట్రీ రంగానికి అవసరమైన ముడిసరుకులు సకాలంలో అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దాణా ధరలు పెరగడం, ముడిసరుకుల కొరత వంటి సమస్యలు పరిశ్రమపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

పౌల్ట్రీ ఫారాల ఏర్పాటుకు ప్రస్తుతం ఎదురవుతున్న అనుమతుల సమస్యలను తగ్గించేందుకు సింగిల్ విండో విధానం తీసుకొస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామ పంచాయతీల పరిధిలోనూ పౌల్ట్రీ ఫారాలు నిర్మించుకునే విషయంలో అనుమతుల ప్రక్రియను సరళీకరించేలా మార్పులు చేపడతామని తెలిపారు. వివిధ శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే విధానం ద్వారా అనుమతులు పొందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. దీనివల్ల కొత్తగా పౌల్ట్రీ వ్యాపారంలోకి రావాలనుకునే వారికి సౌలభ్యం కలుగుతుందని, ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

పౌల్ట్రీ పరిశ్రమ కేవలం కోళ్లు, గుడ్ల ఉత్పత్తికే పరిమితం కాలేదని, రైతుల ఆర్థిక బలోపేతానికి కూడా కీలకంగా మారిందని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రోజుకు సుమారు 5 కోట్ల 30 లక్షల గుడ్ల ఉత్పత్తి జరుగుతోందని, విద్యార్థులు, యువతకు పౌష్టికాహారం అందించడంలో పౌల్ట్రీ రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని వివరించారు. ఈ పరిశ్రమ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైతులకు ఆదాయ మార్గాలు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. అందువల్ల పౌల్ట్రీ రంగాన్ని ప్రభుత్వం ఒక ప్రాధాన్యత కలిగిన పరిశ్రమగా గుర్తిస్తుందని స్పష్టం చేశారు.

పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలతో సరిపెట్టకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందిస్తామని సీఎం తెలిపారు. పౌల్ట్రీ రంగంలో కాలానుగుణంగా తలెత్తే సమస్యలు, క్షేత్రస్థాయిలో ఉన్న అవసరాలను పరిశీలిస్తూ పాలసీలను మెరుగుపరుస్తామని చెప్పారు. ఒడిదొడుకులను తట్టుకుని పరిశ్రమను ముందుకు తీసుకెళ్తున్న నిర్వాహకుల కృషిని అభినందించారు. పెట్టుబడులకు తెలంగాణలో ఎప్పుడూ రక్షణ ఉంటుందని, రాష్ట్రంలో పాలసీ పక్షవాతం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు రూపొందించిన మంచి విధానాలను కొనసాగిస్తూనే, అవసరాలకు అనుగుణంగా కొత్త విధానాలను తీసుకొస్తున్నామని వివరించారు.

పౌల్ట్రీ రంగానికి సంబంధించిన సమావేశాలు, సదస్సులు నిర్వహించుకునేందుకు వీలుగా ఫ్యూచర్ సిటీలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు స్థలం కేటాయించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రతిపాదనను రాబోయే గ్లోబల్ సమిట్ వేదికగా ప్రభుత్వానికి అందించాలని పరిశ్రమ ప్రతినిధులకు సూచించారు. పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ లక్ష్య సాధనలో వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు పౌల్ట్రీ పరిశ్రమ కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు, ఉపాధి, ఆహార ఉత్పత్తి, రైతుల ఆదాయం పెంపు వంటి అంశాల్లో పౌల్ట్రీ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి, పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Related News

Latest News