ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, అక్టోబర్ 29: కరీంనగర్ జిల్లాలో ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె నేటితో 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని సందర్శించిన చొప్పదండి బీఆర్ఎస్ ఎంపీపీ చిలుక రవి, టీడీపీ రాష్ట్ర కన్వీనర్ సత్యం, ఎన్హెచ్ఎం ఉద్యోగులకు సంఘీభావం తెలిపి, వారి న్యాయమైన డిమాండ్లకు మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులకు వివరించారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు.
అలాగే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం వేతన ఇంక్రిమెంట్లు కల్పించాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని, ఉద్యోగులకు ఆరోగ్య భద్రతతో పాటు ఇతర న్యాయమైన ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఎన్హెచ్ఎం జేఏసీ నాయకులు కోరారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలపడం ఉద్యోగులకు మరింత నైతిక బలాన్ని అందిస్తోంది.ఎన్హెచ్ఎం ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ఎన్హెచ్ఎం జేఏసీ కరీంనగర్ జిల్లా కమిటీ స్పష్టం చేసింది.





























