సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

మెదక్ కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఒకరోజు నిరాహార దీక్ష

ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 13: సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వినోద్, ప్రధాన కార్యదర్శి శ్రీలత మాట్లాడుతూ.. ఉద్యోగుల క్రమబద్ధీకరణతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఉద్యోగికి క్యాడర్ ఫిక్సేషన్ అమలు చేసి, 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని డిమాండ్ చేశారు.ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ స్టేట్ హెల్త్ సొసైటీలోనే కొనసాగించాలని, స్పర్శ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలని కోరారు. 2022 నుంచి ప్రతి సంవత్సరం ఐదు శాతం ఇంక్రిమెంట్‌తో పాటు ఎనిమిది శాతం లాయల్టీ బోనస్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగానే ఎన్‌హెచ్‌ఎం మహిళా ఉద్యోగులకు క్యాడర్‌తో సంబంధం లేకుండా 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. విధుల్లో ఉండగా ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా లేదా బీమా పరిహారం అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి విద్యార్హతల ఆధారంగా ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రతతో పాటు ఈహెచ్‌ఎస్‌/ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, ప్రతి నెల ఐదో తేదీలోపు జీతాలు చెల్లించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న తొమ్మిది నెలల పీఆర్‌సీ, బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీవో నంబర్‌ 60, 1195 ప్రకారం పెంచిన వేతనాలు చెల్లించాలని, వేతనాలు తగ్గిన ఉద్యోగులకు పూర్వపు వేతనాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఈ నిరాహార దీక్షలో సురేష్, సాయికిరణ్, క్రాంతి, కోట, రమేష్, మధు, దుర్గమణి, నిర్మల, నవీన్, సుభాషిణి, దుర్గరాజు, తన్వీర్ సుల్తానా, రాజలక్ష్మి, రాజశేఖర్, నిఖిల్, మాధురి, మహేష్, అమృతి, జ్యోతి, యాదమ్మ, ప్రియాంక, సాయి దీప్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News