ప్రతిపక్షం, ఆగస్టు 06: తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన “సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ”కు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సామాజిక న్యాయం, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు, ఇతర వెనుకబడిన వర్గాల హక్కులపై విస్తృతంగా మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
కవిత మాట్లాడుతూ, ఈ సంకల్ప సభ తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో మార్పుకు నాంది పలుకుతుందని అన్నారు. రాజ్యాంగం సామాజిక న్యాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అది పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని వ్యాఖ్యానించారు. అందుకే సామాజిక న్యాయం కోసం మరో ఉద్యమం అవసరమైందని చెప్పారు.
తాను బీసీల కోసం మాట్లాడితే అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిగా విమర్శలు ఎదుర్కొంటున్నానని పేర్కొన్నారు. తన పుట్టుక తన చేతిలో లేకపోయినా, ఎవరి కోసం పనిచేయాలో నిర్ణయించుకునే హక్కు తనదేనని స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగే వరకు తన జీవితాన్ని అంకితం చేస్తానని వెల్లడించారు.
బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌ను కవిత ప్రధానంగా ప్రస్తావించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లు పెండింగ్‌లో ఉందని పేర్కొంటూ, వచ్చే బడ్జెట్ సమావేశాల లోపు దానిని ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు. లేదంటే వెయ్యి కార్లతో “ఛలో ఢిల్లీ” కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
సామాజిక న్యాయం అంటే ఎవరి హక్కులను లాక్కోవడం కాదని, సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమేనని ఆమె వివరించారు. దేశంలో ఇప్పటివరకు వచ్చిన అనేక సంస్కరణలు అగ్రవర్ణాలకు చెందిన ప్రజాస్వామ్యవాదుల కృషితోనే సాధ్యమయ్యాయని గుర్తు చేశారు. గౌతమ బుద్ధుడు, సాహూ మహారాజ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, జయలలిత వంటి నాయకుల పాత్రను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తెలంగాణ ఉద్యమం భౌగోళిక రాష్ట్రాన్ని సాధించిందని, ఇక సామాజిక తెలంగాణ నిర్మాణమే తదుపరి లక్ష్యమని కవిత అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన “ముందు తెలంగాణ, తర్వాత సామాజిక తెలంగాణ” అనే ఆలోచనను ఇప్పుడు కార్యరూపంలోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఇంకా అధిక శాతం ప్రజలు వెనుకబడే ఉన్నారని, లక్షలాది బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె తెలిపారు. వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు అడవులపై పూర్తి హక్కులు కల్పించాలని, ముస్లింలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, ఆర్థిక సాధికారత కల్పించాలని, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, ట్రాన్స్జెండర్లు, వికలాంగులకు సమాన హక్కులు, సంక్షేమం అందించాలని కోరారు.
సంకల్ప సభలో పలు కీలక తీర్మానాలు కూడా ఆమోదించారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగించడం, మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులకు భారతరత్న ప్రకటించడం, ప్రొఫెసర్ జయశంకర్‌కు పద్మవిభూషణ్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం, ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ఆదివాసీల అటవీ హక్కుల పరిరక్షణ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, మైనార్టీలు, సిక్కులు, క్రైస్తవులు, ట్రాన్స్జెండర్లు, వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.
సామాజిక న్యాయ ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్తామని, వచ్చే ఏడాది ఆగస్టు 6న ఈ ఉద్యమ ప్రగతిని సమీక్షిస్తామని కల్వకుంట్ల కవిత ప్రకటించారు.






















