[t4b-ticker]

సర్జరీ చేయాల్సిన చోట బ్యాండేజా.. ‘పేపర్ లీక్’ బిల్లుపై రాహుల్

ప్రతిపక్షం, జూలై 29: లోక్‌సభలో ప్రవేశపెట్టిన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు తీసుకొచ్చిన ఈ బిల్లు అసలు సమస్యలను పరిష్కరించేలా లేదని ఆయన వ్యాఖ్యానించారు.

లోక్‌సభలో బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, “సర్జరీ చేయాల్సిన చోట బ్యాండేజీ కట్టినట్లుగా ఈ బిల్లు ఉంది. పరీక్షల అవకతవకలకు మూలకారణాలను గుర్తించి పరిష్కరించే చర్యలు ఇందులో కనిపించడం లేదు” అని విమర్శించారు.

పరీక్షా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు బాధ్యులైన అసలు నెట్‌వర్క్‌లపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని ఆయన ఆరోపించారు. ఈ చట్టం కింద ఇప్పటివరకు ఎవరికీ శిక్ష పడలేదని, కేవలం కొత్త చట్టాలు తీసుకురావడం ద్వారా సమస్య పరిష్కారం కాదన్నారు.

దేశంలోని విద్యార్థులు పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత, సమూల సంస్కరణలు కోరుకుంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. పరీక్షా విధానంలో మూలస్థాయి మార్పులు తీసుకురాకుండా పేపర్ లీకేజీలకు పూర్తిగా అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.

కాగా, ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై అధికార, ప్రతిపక్షాల మధ్య లోక్‌సభలో విస్తృత చర్చ కొనసాగుతోంది. ఈ బిల్లుతో పరీక్షల భద్రతను మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వం చెబుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం దీనిలో అనేక లోపాలు ఉన్నాయని విమర్శిస్తున్నాయి.

Spread the love

Related News

Latest News