[t4b-ticker]

మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు సహించం

  • కవితమ్మను కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి
  • కానిస్టేబుల్‌ అనిల్‌పై శాఖాపరమైన విచారణ జరపాలి
  • తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్

ప్రతిపక్షం, కరీంనగర్‌, సెప్టెంబర్‌ 2: తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కవితమ్మపై సోషల్‌ మీడియా వేదికగా అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్‌ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం కరీంనగర్‌ ఒకటో పోలీస్‌ స్టేషన్‌లో పార్టీ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా హరిప్రసాద్‌ మాట్లాడుతూ.. ఫేస్‌బుక్‌, ఎక్స్‌ (ట్విట్టర్‌), ఇతర సోషల్‌ మీడియా వేదికల్లో కవితమ్మను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ కె. అనిల్‌పై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధ్యతాయుతమైన పోలీస్‌ ఉద్యోగంలో ఉండి మహిళా నాయకురాలిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. సోషల్‌ మీడియాలో మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కవితమ్మపై చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, వ్యాఖ్యల వెనుక ఎవరైనా ఉన్నట్లయితే వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పోలీస్‌ శాఖకు ప్రజల రక్షణతోపాటు మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఉందని గుర్తు చేశారు. అందువల్ల ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.కార్యక్రమంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగంపల్లి నాగరాజు, కరీంనగర్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి అంకం శివరాణి, మానకొండూర్‌ ఇన్‌చార్జి చెన్నమల్ల చైతన్య, చొప్పదండి నాయకులు మ్యాకల తిరుపతి, జిల్లా నాయకులు రంగరవేణి లక్ష్మణ్‌, కుతాడి శ్రీనివాస్‌, శ్రీరాముల రమేష్‌, బసవేణి రాజేందర్‌, యండి హుస్సేన్‌, యండి రాజీ, మడిపల్లి వినీత్‌, బాండారి అభిరామ్‌, మహిళా నాయకులు జంగ అపర్ణ, అసియా సుల్తానా, పల్లె శారద, తుట్తేవార్‌ అకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News