- నిబంధనలు ఉల్లంఘిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
- యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంద గణేష్
ప్రతిపక్షం, కరీంనగర్, సెప్టెంబర్ 2: జూనియర్ కళాశాల నిర్వహణకు అనుమతి తీసుకుని ఒకే క్యాంపస్లో డిఫెన్స్, నీట్, జేఈఈ అడ్వాన్స్డ్ తదితర అకాడమీల పేర్లతో తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంద గణేష్ డిమాండ్ చేశారు.ఈ మేరకు బుధవారం యుఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. జూనియర్ కళాశాల పేరుతో అనుమతులు తీసుకుని అదే ప్రాంగణంలో వివిధ అకాడమీల పేర్లతో తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. దీంతో కళాశాల నిర్వహిస్తున్నారా.. అకాడమీ నడుపుతున్నారా అనే పరిస్థితి నెలకొందని విమర్శించారు.జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న కళాశాలలను గుర్తించాలని కోరారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అక్రమంగా నిర్వహిస్తున్న తరగతులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాటిని మూసివేయాలని డిమాండ్ చేశారు.వినతిపత్రం సమర్పించిన వారిలో భూషమని తేజ, వెంకటేష్, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.





























