ప్రతిపక్షం, జూలై 30: ఆధునిక సాంకేతికత అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం కాపాడగలదని మరోసారి రుజువైంది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఒంటరిగా నివసిస్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఇంట్లో కుప్పకూలగా, ఆయన చేతికి ఉన్న యాపిల్ వాచ్ సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి రక్షించింది.
ఇస్లాం అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా నేలపై పడిపోవడంతో, యాపిల్ వాచ్‌లోని ఫాల్ డిటెక్షన్ (Fall Detection) ఫీచర్ ఆ ప్రమాదాన్ని వెంటనే గుర్తించింది. కొంతసేపు స్పందన రాకపోవడంతో వాచ్ స్వయంచాలకంగా అత్యవసర సేవలకు అలర్ట్ పంపి, అతడి ప్రస్తుత లొకేషన్‌ను షేర్ చేసింది.
సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. సకాలంలో వైద్య సహాయం అందడంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ఈ ఘటనతో యాపిల్ వాచ్‌లోని భద్రతా ఫీచర్లపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా వృద్ధులు, ఒంటరిగా నివసించే వారు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఇలాంటి స్మార్ట్ వాచ్‌లు అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

















