దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభం
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ అక్టోబర్ 18: రామాయంపేట మండలం సుతార్పల్లిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శనివారం అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. భాజాభజంత్రీలు, బాణాసంచా పేలుళ్లు, మహిళల మంగళహారతులతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సుమారు 500 మందికి పైగా గ్రామస్థులు, మహిళలు, యువత పాల్గొన్నారు.ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
ఈ సందర్భంగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, దుర్గామాత ఆశీస్సులతో సుతార్పల్లి గ్రామంతో పాటు రామాయంపేట మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రైతులు పాడిపంటలతో తులతూగాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తి, సేవాభావం, ఐకమత్యానికి నవరాత్రి ఉత్సవాలు ప్రతీకలని పేర్కొన్నారు.ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల ప్రతినిధులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు, యువత, ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.































