రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, నవంబర్ 18: ఎలినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఎండిపోయిన పంటలను మెతుకు సీమ కరువు అధ్యయన కమిటీ సభ్యులు మంగళవారం పరిశీలించారు. చిన్నశంకరంపేట మండలంలోని ఎస్ కొండాపూర్. పోతుగడ్డ తాండ. గ్రామాల్లో కమిటీ పర్యటించి పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోతుగడ్డ గ్రామంలో సుమారు 20 ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్లు గుర్తించారు. సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతులు వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయారని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, ప్రత్యామ్నాయంగా సాగు చేసుకునేందుకు ఆరుతడి పంటల విత్తనాలను ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు.ఈ పర్యటనలో మెదక్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొండల్ రెడ్డి సిపిఎం నాయకులు మల్లేశం మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి, తెలంగాణ రక్షణ సేన నాయకుడు బట్టి అజయ్, చిన్నశంకరంపేట మండల టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు నరేష్ యాదవ్, మండల టీఆర్ఎస్ ప్రెస్ విభాగం అధ్యక్షుడు పౌడాల శ్రీకాంత్, మెదక్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు చౌదరి భాను, మధు కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ రైతులు, ప్రజలు కూడా పాల్గొన్నారు.





























