ప్రతిపక్షం, నవంబర్ 08: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు చేసుకోలేకపోయిన వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఓటరు నమోదు గడువు ముగిసినప్పటికీ, అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును పొందేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 25న విడుదల చేయనుంది. ముసాయిదా జాబితా ప్రకటించిన తేదీ నుంచి డిసెంబర్ 10 వరకు కొత్తగా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవడంతో పాటు, జాబితాలో ఏవైనా తప్పులు ఉంటే అభ్యంతరాలు, ఫిర్యాదులు తెలియజేయడానికి అవకాశం కల్పించనుంది. దీంతో ఇప్పటివరకు ఓటు నమోదు చేసుకోని అర్హులైన పట్టభద్రులకు మరో అవకాశం లభించినట్లయింది.
ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 25న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల కానుంది. ఈ జాబితాలో తమ పేరు ఉందో లేదో పట్టభద్రులు పరిశీలించుకోవాలి. ఒకవేళ పేరు లేకపోయినా, వ్యక్తిగత వివరాల్లో తప్పులు ఉన్నా నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన పట్టభద్రులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటు నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 10 వరకు అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
ఇదిలా ఉండగా, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు మొత్తం 12,69,781 ఓటరు నమోదు దరఖాస్తులు అందినట్లు సమాచారం. ఈ రెండు నియోజకవర్గాల్లో పట్టభద్రుల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం ఎన్నికల ప్రాధాన్యతను తెలియజేస్తోంది. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కీలకం కానున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్లు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో ముందుగానే పరిశీలించుకోవడం అవసరం. నిర్ణీత గడువులోగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకుంటేనే రానున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది.





























