[t4b-ticker]

నేతాజీ అస్థికలపై సుప్రీంకోర్టు ఆదేశాలు.. కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ

ప్రతిపక్షం, ఆగస్టు 14: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన అస్థికలను జపాన్ నుంచి భారత్‌కు తీసుకురావాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. 1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు పలు విచారణ కమిటీల నివేదికలు, సమాచార హక్కు చట్టం కింద కేంద్రం ఇచ్చిన సమాధానాలు పేర్కొన్నాయి. అయితే ఆయన అస్థికలు గత ఎనిమిది దశాబ్దాలుగా జపాన్‌లోని రెన్కోజీ ఆలయంలోనే ఉన్నాయి.

నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని కోరుతూ ఆయన కుమార్తె అనితా బోస్ ఫాఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని ఆదేశించింది. దీంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

నేతాజీ మరణానికి సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన విచారణ కమిటీలు ఆయన 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు నివేదికలు సమర్పించాయి. అనంతరం ఆయన అస్థికలను జపాన్‌లోని టోక్యోలో ఉన్న రెన్కోజీ ఆలయంలో భద్రపరిచినట్లు చెబుతున్నారు. అయితే నేతాజీ మరణంపై అప్పటినుంచి పలు అనుమానాలు, భిన్నాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇప్పటికే నేతాజీకి సంబంధించిన పత్రాలు, రహస్య దస్తావేజులను కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అస్థికలను భారత్‌కు తీసుకురావాలన్న అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News