ప్రతిపక్షం, జూలై 28: హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ తనపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ తాను ఎక్కడా కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి చట్టబద్ధంగా విధులు నిర్వర్తిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడం, ఆక్రమణలను తొలగించడం మాత్రమే హైడ్రా లక్ష్యమని పేర్కొన్నారు.
హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి విముక్తం చేసినట్లు రంగనాథ్ వెల్లడించారు. మార్కెట్ విలువ ప్రకారం ఇప్పటివరకు రక్షించిన ప్రభుత్వ భూముల విలువ సుమారు రూ.1.50 లక్షల కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. రాజకీయ, ఆర్థిక పలుకుబడి ఉన్న పలువురు ఆక్రమణదారుల నుంచి వేల ఎకరాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
తమ చర్యలతో నష్టపోయిన కబ్జాదారులు పెద్ద సంఖ్యలో కోర్టులను ఆశ్రయించారని, వారు దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలోనే కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే తాను వ్యక్తిగతంగా ఎలాంటి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని, చట్టపరమైన ప్రక్రియను ఎప్పుడూ గౌరవించానని స్పష్టం చేశారు.
ఇటీవల హైడ్రాపై వచ్చిన విమర్శలు, న్యాయపరమైన అంశాలపై స్పందిస్తూ ప్రభుత్వ భూముల పరిరక్షణలో హైడ్రా పారదర్శకంగా పనిచేస్తోందని అన్నారు. ప్రజా ప్రయోజనాలకే తమ చర్యలు పరిమితమని, ఎవరిపైనా వ్యక్తిగత లక్ష్యంతో వ్యవహరించడం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం తనకు ఏ బాధ్యత అప్పగించినా అదే నిబద్ధతతో నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని రంగనాథ్ తెలిపారు. ప్రజా ఆస్తులను కాపాడటం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అని, ఆ బాధ్యతను చట్టబద్ధంగా కొనసాగిస్తానని చెప్పారు.

















