చెన్నూరును వణికిస్తున్న జ్వరాలు.. వారం రోజుల్లో ఇద్దరి మృతి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 30, చెన్నూరు: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని చెన్నూరు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వైరల్‌, డెంగ్యూ జ్వరాల కేసులు పెరుగుతున్నట్లు స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. జ్వరాల కారణంగా పలువురు ఆసుపత్రులను ఆశ్రయిస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కేంద్రాల్లో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సమాచారం. గడిచిన వారం రోజుల్లో వైరల్‌ జ్వరం, డెంగ్యూ లక్షణాలతో ఇద్దరు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో పాటు పలు ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు, దోమల వ్యాప్తి జ్వరాల పెరుగుదలకు కారణమవుతున్నాయనే అభిప్రాయాలు స్థానికంగా వినిపిస్తున్నాయి. పట్టణంలోని కొన్ని కాలనీలు, మండలంలోని గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడం, మురుగు కాలువలు, పరిసరాల్లో నిలిచిన నీటితో దోమలు పెరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. దీంతో జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలని వారు కోరుతున్నారు.

మరోవైపు తాగునీటి సరఫరా పైపులైన్లలో అక్కడక్కడా లీకేజీలు ఏర్పడటంతో నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీరు, పారిశుధ్య లోపాలు, దోమల వ్యాప్తి వంటి సమస్యలపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాలు, పట్టణంలోని పలు కాలనీల్లో ఇళ్లకు ఒకరు లేదా ఇద్దరు చొప్పున జ్వరాలతో బాధపడుతున్న పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు.

ఇటీవల మండలంలోని అంగ్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక రత్న నిహానిరెడ్డి వైరల్‌ జ్వరంతో అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తొలుత స్థానికంగా చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మంచిర్యాలకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం తరలిస్తున్న సమయంలో డెంగ్యూ లక్షణాలతో బాలిక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

అదేవిధంగా మండలంలోని కత్తెరసాల గ్రామానికి చెందిన అంగ మైత్రి(21) కూడా వైరల్‌ జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తొలుత స్థానికంగా చికిత్స తీసుకున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో మంచిర్యాలకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు ఆమె బంధువులు తెలిపారు. వరుసగా ఇద్దరు మృతి చెందడంతో స్థానికంగా ఆందోళన మరింత పెరిగింది.

రోజుకు వందల సంఖ్యలో జ్వర బాధితులు

చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి జ్వరాలతో వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రోజుకు సుమారు 300 నుంచి 400 మంది వరకు జ్వర బాధితులు వైద్య పరీక్షల కోసం వస్తున్నారు. ఈ నెల 25న 297 మంది, 26న 345 మంది, 27న 110 మంది, 28న 359 మంది, మంగళవారం 260 మంది ఆసుపత్రికి వచ్చినట్లు వివరించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలోనే జ్వర బాధితుల సంఖ్య ఈ స్థాయిలో ఉంటే.. పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులు, స్థానిక వైద్యుల వద్దకు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల, హైదరాబాద్‌ వంటి పట్టణాలకు తరలివెళ్తున్నారు.

జ్వరాల వ్యాప్తి నేపథ్యంలో గ్రామాలు, పట్టణ కాలనీల్లో పారిశుధ్య చర్యలు చేపట్టడంతో పాటు దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. తాగునీటి పైపులైన్ల లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయడం, పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love

Related News

Latest News