ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 15: ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎదుట జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరాహార దీక్ష గురువారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎం ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించడంతోపాటు ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. దీర్ఘకాలంగా ఆరోగ్య శాఖలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఎం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వినోద్, ప్రధాన కార్యదర్శి శ్రీలత సురేష్, సాయికిరణ్, క్రాంతి, కోట, రమేష్, మధు, దుర్గమణి, నిర్మల, నవీన్, సుభాషిణి, దుర్గరాజు, తన్వీర్ సుల్తానా, రాజలక్ష్మి, రాజశేఖర్, నిఖిల్, మాధురి, మహేష్, అమృతి, జ్యోతి, యాదమ్మ, ప్రియాంక, సాయి దీప్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




























