కేంద్రం కీలక నిర్ణయం- అగ్నివీరుల పెళ్లికి గ్రీన్‌సిగ్నల్

ప్రతిపక్షం, నవంబర్ 22: అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల ప్రాథమిక సేవాకాలం పూర్తయిన తర్వాత మరో రెండేళ్ల సర్వీసు పొడిగింపును ఎంచుకునే అగ్నివీరులు వివాహం చేసుకునేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వెసులుబాటుకు కొన్ని నిబంధనలు విధించింది. రెండో దశ సర్వీసులో చేరి, సుమారు నాలుగు వారాల పాటు కొనసాగే ప్రాథమిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది. ఈ మార్పు యువ సైనికుల వ్యక్తిగత, సామాజిక జీవితానికి కొంత ఊరటనివ్వనుంది.

2022లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి అగ్నివీరుల మొదటి నాలుగేళ్ల సర్వీసు కాలంలో వివాహం చేసుకోవడానికి అనుమతి లేదు. దేశ రక్షణ బాధ్యతల్లో ఉన్న యువకులు నిర్ణీత కాలం పాటు పూర్తి స్థాయిలో విధులపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిబంధన అమలు చేశారు. అయితే తాజాగా రెండేళ్ల అదనపు సేవను ఎంచుకునే వారికి ఈ నిబంధనలో సడలింపు కల్పించారు. రెండో దశలో అవసరమైన శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే వివాహానికి అవకాశం కల్పించడం ద్వారా సైనిక విధులకు ప్రాధాన్యం ఇచ్చేలా నిబంధనలు రూపొందించారు.

మరోవైపు అగ్నివీరుల సేవాకాలాన్ని రెండేళ్ల పాటు పొడిగించే అంశంపై కేంద్రం ఇప్పటికే కీలక నిర్ణయం ప్రకటించింది. అగ్నిపథ్ కింద ఎంపికైన యువకుల నాలుగేళ్ల ప్రాథమిక పదవీకాలం ముగిసిన తర్వాత, అదనంగా మరో రెండేళ్ల పాటు సైన్యంలో పనిచేసే అవకాశం కల్పించనుంది. ఇప్పటివరకు నాలుగేళ్ల సేవ అనంతరం ప్రతిభ ఆధారంగా 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే సాధారణ సాయుధ దళాల్లోకి తీసుకునే విధానం ఉంది. మిగిలిన 75 శాతం మంది సేవాకాలం ముగిసిన తర్వాత బయటకు రావాల్సి వచ్చేది. తాజా మార్పుతో ఈ 75 శాతం మందికి కూడా మరో రెండేళ్ల పాటు సేవలు అందించే అవకాశం కల్పించనున్నారు.

ఈ అదనపు రెండేళ్ల సేవాకాలం పూర్తయిన తర్వాత సాయుధ దళాల్లో కొనసాగాలని ఆసక్తి చూపే అగ్నివీరులకు మరో అవకాశం కల్పించనున్నారు. అయితే ఇందుకోసం నిర్దేశించిన ఎంపిక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అర్హత, ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుంది. ఈ మార్పులకు సంబంధించిన వివరాలను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి వెల్లడించినట్లు సమాచారం.

2022 జూన్ 14న కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచే అగ్నివీరుల పనితీరును నిరంతరం సమీక్షిస్తామని, అవసరాన్ని బట్టి నిబంధనల్లో మార్పులు చేస్తామని ప్రభుత్వం పేర్కొంటూ వచ్చింది. మొదటి బ్యాచ్ అగ్నివీరుల నాలుగేళ్ల సేవాకాలం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో వారి పనితీరును పరిగణనలోకి తీసుకుని అదనపు సేవకు అవకాశం కల్పించే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, త్రివిధ దళాల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు రానున్న రోజుల్లో అగ్నివీరుల నియామకాలను పెంచే అంశాన్ని కూడా భారత సైన్యం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అగ్నిపథ్ పథకంలో వరుస మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని సవరణలు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది.

Related News

Latest News