తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 19: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలుగా నిలిచే బతుకమ్మ, విజయదశమి పండుగలను పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిలో సహజంగా లభించే రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, మహిళలు, యువతులు, బాలికలు తొమ్మిది రోజులపాటు ఆటపాటలతో పండుగను జరుపుకోవడం తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, సామూహిక ఐక్యతను చాటిచెప్పే బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.విజయదశమి పర్వదినం జిల్లా ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతిసౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు. దసరా పండుగ ప్రతి ఒక్కరిలో నూతనోత్సాహాన్ని నింపి, మరిన్ని విజయాలు సాధించేలా దోహదపడాలని అన్నారు. ప్రజలందరూ బతుకమ్మ, విజయదశమి పండుగలను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.





























