ప్రతిపక్షం, నవంబర్ 10: హైదరాబాద్లోని మాదాపూర్ డివిజన్ పరిధిలో ఖానామెట్ వద్ద ఉన్న తమ్మిడికుంట చెరువు అభివృద్ధి పనులు పూర్తికావడంతో బుధవారం (నవంబర్ 11) ప్రజలకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సాయంత్రం 5 గంటలకు చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, మహిళలు, పాత్రికేయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ నేత ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం విడుదల చేశారు.
తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తుండటంపై ఆరెకపూడి గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి తన తరఫున, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. చెరువు అభివృద్ధికి సహకరించి, దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఒకప్పుడు ఆక్రమణలు, నిర్మాణాల కారణంగా కుంచించుకుపోయిన చెరువును తిరిగి పూర్వ వైభవానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు.
తమ్మిడికుంట చెరువు పరిధిలో జరిగిన ఆక్రమణలను తొలగించి, చెరువు విస్తీర్ణాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు గాంధీ తెలిపారు. చెరువు ప్రాంతంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. చెరువు కుంచించుకుపోకుండా దాని అసలు విస్తీర్ణాన్ని పరిరక్షించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే చెరువుకు అనుసంధానంగా ఉన్న నాలాల పునరుద్ధరణ పనులు కూడా చేపట్టి పూర్తి చేసినట్లు వెల్లడించారు.
చెరువు అభివృద్ధిలో భాగంగా సుందరీకరణ పనులు చేపట్టి, పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్దినట్లు ఆరెకపూడి గాంధీ వివరించారు. అన్ని హంగులతో అభివృద్ధి చేసిన తమ్మిడికుంట చెరువును సుందర శోభిత వనంగా రూపుదిద్దినట్లు తెలిపారు. చెరువు పరిసరాల్లో నివసించే ప్రజలకు సేదతీరేందుకు, కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపేందుకు అనువైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. చెరువు పరిరక్షణతో పాటు పచ్చదనం, పరిసరాల సుందరీకరణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు.
నవంబర్ 11న సాయంత్రం 5 గంటలకు జరిగే ప్రారంభోత్సవానికి తాజా మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, మహిళా సోదరీమణులు, పాత్రికేయ మిత్రులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని గాంధీ విజ్ఞప్తి చేశారు. తమ్మిడికుంట చెరువు అభివృద్ధి పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావడం స్థానికులకు ఉపయోగకరంగా ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని ఆయన కోరారు.





























