ప్రతిపక్షం, ఆగస్టు 01: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్ తెలుగు-10’ త్వరలో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ సీజన్ సెప్టెంబర్ తొలి వారంలో గ్రాండ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఇటీవల హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జునతో కొత్త సీజన్‌కు సంబంధించిన ప్రోమో చిత్రీకరణ జరిగినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ ప్రోమోను విడుదల చేసి కొత్త సీజన్‌పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈసారి పదో సీజన్‌కు ‘దశావతారం’ అనే ట్యాగ్‌లైన్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సీజన్‌లో కాన్సెప్ట్ పూర్తిగా కొత్తగా ఉండబోతోందనే చర్చ నడుస్తోంది. అంతేకాకుండా, ఈసారి కేవలం పది మంది కంటెస్టెంట్లే హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే కంటెస్టెంట్ల సంఖ్య, ట్యాగ్‌లైన్, ప్రారంభ తేదీ వంటి అంశాలపై ఇప్పటివరకు షో నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈ వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సినీ, టెలివిజన్, సోషల్ మీడియా రంగాలకు చెందిన ప్రముఖులు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారనే అంచనాలు ఉన్నాయి. అధికారిక ప్రకటన వెలువడే వరకు ప్రచారంలో ఉన్న వివరాలపై పూర్తి స్పష్టత లేదని నిర్వాహక వర్గాలు పేర్కొంటున్నాయి.

















