[t4b-ticker]

నాలుగు దేశాల్లో రేవంత్ పెట్టుబడుల పర్యటన.. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి గ్లోబల్ భాగస్వామ్యాలే లక్ష్యం

ప్రతిపక్షం, ఆగస్టు 05: తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాలను విస్తరించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 17 నుంచి నాలుగు దేశాల్లో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో జరిగే పెట్టుబడిదారుల సమావేశాల్లో పాల్గొని రాష్ట్ర అభివృద్ధి అవకాశాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. ఈ విదేశీ పర్యటన సెప్టెంబర్ 10 వరకు కొనసాగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఈ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ వేదికపై ప్రధానంగా ప్రదర్శించనున్నారు. భవిష్యత్ నగర నిర్మాణం, స్మార్ట్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ కనెక్టివిటీ, గ్రీన్ టెక్నాలజీ, ఆధునిక పారిశ్రామిక విధానాలపై పెట్టుబడిదారులకు సమగ్ర వివరాలు అందించి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు.

అదే సమయంలో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, క్రీడా శిక్షణ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాల ఏర్పాటుపై కూడా చర్చలు జరగనున్నాయి. ఉన్నత విద్య, పరిశోధన, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారం పెంచేందుకు పలు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రంలో ఉపాధి అవకాశాల విస్తరణ, పారిశ్రామిక వృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెంపు లక్ష్యంగా ఈ విదేశీ పర్యటనను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావిస్తోంది. ఈ పర్యటన ద్వారా తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు అంతర్జాతీయ మద్దతు లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Spread the love

Related News

Latest News