[t4b-ticker]

ట్రెండ్ మారింది గురూ.. సూర్యాపేట బస్టాండ్‌లో ‘మగాళ్లకూ’ ప్రత్యేక గౌరవం!

ప్రతిపక్షం, ఆగస్టు 14, సూర్యాపేట: తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఓ బోర్డు ప్రస్తుతం ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా బస్సుల్లో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు కేటాయించిన సీట్లను గౌరవించాలని సూచించే బోర్డులు కనిపిస్తుంటాయి. అయితే సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ఓ బోర్డు మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో ప్రయాణికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బోర్డుపై “పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టండి” అంటూ సందేశం కనిపిస్తోంది. సాధారణంగా మహిళలకు గౌరవం, ప్రత్యేక సీట్లకు సంబంధించిన సూచనలు కనిపించే చోట ఇలా పురుషుల గురించి సందేశం ఉండటంతో ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది.

బోర్డును చూసిన పలువురు ప్రయాణికులు సరదాగా స్పందిస్తున్నారు. “ట్రెండ్ మారింది.. మగాళ్లకూ మంచి రోజులొచ్చాయ్” అంటూ నవ్వుకుంటున్నారు. మరికొందరు మాత్రం పురుషులకు కేటాయించిన సీట్లను ఇతరులు ఆక్రమించకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ సందేశాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చని అంటున్నారు.

ప్రస్తుతం ఈ బోర్డు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా కనిపించే సందేశాలకు భిన్నంగా ఉండటంతో నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మొత్తానికి సూర్యాపేట కొత్త బస్టాండ్‌లోని ఈ చిన్న బోర్డు ప్రయాణికులకు మాత్రం కాస్త వినోదాన్ని పంచుతోంది.

Spread the love

Related News

Latest News